: అదృష్టాన్ని పరీక్షించుకోవద్దు: భారత్‌కు చైనా హెచ్చరిక
డోక్లాం సరిహద్దు వివాదం విషయంలో చైనా మిలటరీ శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేసి, సరిహద్దు యుద్ధంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవద్దని భారత్‌ను చైనా హెచ్చరించింది. `పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో యుద్ధం కన్నా పర్వతాన్ని కదిలించడం సులువు` అంటూ చైనా ఆర్మీ ప్రతినిధి వూ కియాన్ భారత్‌కు హితబోధ చేశారు. ఒకప్పటితో పోలిస్తే చైనా మిలటరీ దళం బాగా అభివృద్ధి చెందిందని ఆయన గుర్తుచేశారు. చైనా, భూటాన్, భారత్ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్డు మార్గం నిర్మించకుండా అడ్డుపడుతూ తమ భూభాగంలోకి భారత సైన్యం చొచ్చుకొస్తుందని చైనా ప్రతినిధి ఆరోపించారు.
శాంతి చర్చలు జరపాలంటే ముందు భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించాలని ఆయన అన్నారు. ఒకవేళ అలా చేయకుండా ముందడుగు వేస్తే భారత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడమే అవుతుందని కియాన్ హెచ్చరించారు. `చైనా మిలటరీ గురించి తప్పుగా ఊహించుకొని భారత్ ముందడుగు వేయకుంటే మంచిది. అలాగే తమ తప్పు తెలుసుకుని మా అధికారులతో వీలైనంత త్వరగా శాంతి చర్చలు జరిపితే గానీ సరిహద్దు వద్ద పరిస్థితి మెరుగుపడదు` అని కియాన్ అన్నారు.