: ఉద్యోగి వేతనం కంటే సీఈఓ జీతం 1200 రెట్లు ఎక్కువ!
భారత ప్రైవేట్ కంపెనీల్లో అత్యున్నత పదవులైన సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేతనాలతో పోల్చినపుడు అదే కంపెనీలో పనిచేసే సాధారణ ఉద్యోగి వేతనం వందల రెట్లు తక్కువగా ఉందని తేలింది. సెన్సెక్స్ ఉత్థానపతనాల్లో ప్రముఖ పాత్ర వహించే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల వివరాలను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి తెలియజేశాయి. వీటిని అధ్యయనం చేసిన సెబీ, ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి జీతం కంటే సీఈఓ జీతం 1200 రెట్లు అధికంగా ఉన్నట్టు తెలిపింది. ముఖ్యంగా ఈ తేడా గత ఆర్థిక సంవత్సరంలోనే ఎక్కువగా కనిపించినట్లు సెబీ ప్రకటించింది. ప్రభుత్వ కంపెనీల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ ఉద్యోగి వేతనం కంటే అత్యున్నత స్థాయి ఉద్యోగి వేతనం కేవలం 3 నుంచి 4 రెట్లు మాత్రమే ఎక్కువగా ఉంది.
కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ఎంత వేతనం అందజేయాలనే విషయంలో హద్దు లేకపోవడం వల్లే ఇంత తేడా కనిపిస్తోందని సెబీ అభిప్రాయపడింది. సెబీ నియమాల ప్రకారం తన నికర లాభంలో 5 శాతానికి మించి కంపెనీ డైరెక్టర్‌కు వేతనం చెల్లించకూడదు. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మేనేజింగ్ డైరెక్టర్‌లు ఉంటే వారి మొత్తం జీతాల విలువ కంపెనీ నికరలాభంలో 10 శాతానికి మించకూడదు. ప్రస్తుతం కంపెనీలకు వస్తున్న నికరలాభాలతో పోల్చినపుడు మేనేజింగ్ డైరెక్టర్‌కు పెద్దమొత్తంలోనే వేతనం అందుతోంది. సెబీకి తమ వేతనాల విషయాలను వెల్లడించిన 30 కంపెనీల్లో సగానికి పైగా కంపెనీలు ప్రతి ఏడాది తమ అత్యున్నత స్థాయి ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నాయి. ఇక సాధారణ ఉద్యోగి వేతనాన్ని మాత్రం ఏదో కొద్దిగా పెంచడమో లేక అలాగే ఉంచడమో చేస్తున్నట్లు సెబీ వివరించింది.