: నా రాజకీయ గురువు ఇందిరాగాంధీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వీడ్కోలు కార్యక్రమం నిర్వహించిన సభ్యులందరికీ తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానానికి మార్గదర్శి, రాజకీయ గురువు ఇందిరాగాంధీ అని, ఆమె మహోన్నత నాయకురాలని అన్నారు. 1969 జులైలో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టానని, ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశానని, లోక్ సభకు రెండుసార్లు ఎన్నికయ్యానని చెప్పారు.
నాడు సభలో తాను అడుగుపెట్టినప్పుడు స్వాతంత్ర్య సమరయోథులు, అపర మేధావులు ఉన్నారని గుర్తుచేసుకున్నారు. జీఎస్టీ బిల్లు తేవడం సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమని, భిన్న మతాలు, జాతులు, భాషల ప్రజలంతా ఒకే దేశం, ఒకే జెండాగా ఉండటం గర్వకారణమని అన్నారు. అధికార, ప్రతిపక్షాల వాగ్యుద్ధాలతో పార్లమెంటు విలువైన సమయం వృథా అవుతోందని ప్రణబ్ ఆవేదన వ్యక్తం చేశారు.