: 2019లో తెలంగాణలో అధికారం మాదే: బీజేపీ నేత లక్ష్మణ్
2019లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ జోస్యం చెప్పారు. వరంగల్ లో రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్ తో లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం దృష్టి సారించిందని, దానికి అనుగుణంగా తాము ఇక్కడ పనిచేయాలని అన్నారు. టీఆర్ఎస్ తమకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, ఆ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దీనిపై తమ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉందని, కాంగ్రెస్ తరహా పాలననే టీఆర్ఎస్ అందిస్తోందని, దొందూ దొందేనని..టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.