: సినీ నేపథ్యం లేని పిల్లలకు ఇలాంటి సదుపాయాలు ఉండవు: ‘రోజా’ నటి మధుబాల
1990వ దశకంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ సినిమాలో నటించిన మధుబాల గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తున్న మధుబాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ పిల్లలు తమ వృత్తిలోనే కొనసాగాలని చాలా మంది తల్లిదండ్రులు ఆశపడుతుంటారని, అలాగే, తాను నటిని కాబట్టి, తన పిల్లలు కూడా నటనారంగంలోకి రావాలని అనుకుంటే కచ్చితంగా తాను సాయపడతానని చెప్పింది.
నటనలో శిక్షణ ఇప్పించి, వారి కెరీర్ కి సాయపడే వ్యక్తులను వారికి పరిచయం చేస్తానని చెప్పిన మధుబాల, అవసరమైతే, దర్శకుదు మణిరత్నంకి ఫోన్ చేసి, తన కుమార్తెకు ఓ అవకాశం ఇవ్వమని అడగగలనని చెప్పింది. అదే, సినీ నేపథ్యం లేని వాళ్లకు ఇలాంటి సదుపాయాలు ఉండవని పేర్కొంది. తమ పిల్లలకు అవకాశాలైతే ఇప్పించగలను కానీ, ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందడం, సినిమాల్లో రాణించడమనేది వారి ప్రతిభ, అదృష్టంపైనే ఆధారాపడి ఉంటుందని అభిప్రాయపడింది. కాగా, మధుబాల పెద్ద కూతురు అమేయా వయసు పదహారు సంవత్సరాలు.