: ఫైనల్‌కు ముందు భారత ప్రజల ఆశీస్సులు కోరిన హర్మన్‌ప్రీత్.. నేడే ఫైనల్స్!
మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో చితక్కొట్టిన టీమిండియా బ్యాట్స్ విమెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫైనల్‌కు ముందు భారత ప్రజల ఆశీస్సులు కోరింది. నేడు (ఆదివారం) ఇంగ్లండ్‌తో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి భారత్‌కు మహిళల ప్రపంచకప్ అందించి మిగిలిపోయిన ఆ ఒక్క ముచ్చటా తీర్చుకోవాలని మిథాలీ సేన భావిస్తోంది. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్మన్ మాట్లాడుతూ..
ఇంగ్లండ్‌పై గెలిచి ట్రోపీ కొట్టుకురావాలంటే తనకు, జట్టుకు భారతీయుల ఆశీస్సులు కావాలని కోరింది. ఇతర విషయాలు మన చేతుల్లో ఉండవని పేర్కొన్న హర్మన్, ప్రస్తుతం తమకు కావాల్సింది దేశ ప్రజల ఆశీస్సులు మాత్రమేనని పేర్కొంది. ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్ అవుటైన తర్వాత జట్టు భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకోవాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. అనుకున్నట్టే అందులో విజయం సాధించగలిగానని వివరించింది.
ఆ మ్యాచ్‌లో హర్మన్ ఆసీస్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించింది. కేవలం 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 171 పరుగులు చేసింది. ఆమె ఆటతీరుతో ఫైనల్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దేశం దృష్టిని మొత్తం నేటి ఫైనల్ వైపు తిప్పేసుకుంది. ఇక లార్డ్స్ స్టేడియం అయితే నేడు ప్రేక్షకులతో కిక్కిరిసిపోనుంది. ఇప్పటికే లార్డ్స్ మైదానంలో టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. మహిళల జట్లు తలపడుతున్న మ్యాచ్‌కు ఇంతమంది ప్రేక్షకులు హాజరవడం ఇదే తొలిసారి కానుంది.