: ఎంతో రహస్యంగా చేస్తోన్న విచారణలోని విషయాలు బయటకు ఎలా వస్తున్నాయి?: డ్రగ్స్ కేసుపై రామ్ గోపాల్ వర్మ
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న టాలీవుడ్ ప్రముఖులను హైదరాబాద్‌లోని ఆబ్కారీ శాఖ కార్యాలయంలో అధికారులు విచారిస్తోన్న నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌పై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. డ్రగ్స్ కేసులో విచారణలో అడుగుతున్న విషయాలు బయటకు ఎలా వస్తున్నాయని రామ్ గోపాల్ వర్మ అడిగారు. విచారణ ఎదుర్కుంటున్న వారు చేసిన తప్పు ఇంకా తేలలేదని ఆయన అన్నారు.
ఎంతో రహస్యంగా చేస్తోన్న విచారణలోని విషయాలు బయటకు ఎలా వస్తున్నాయని తనకు అనుమానం పుట్టుకొచ్చిందని వర్మ చెప్పారు. అధికారులు ఆ విషయాలను చెప్పకపోతే న్యూస్ ఛానెళ్లకు ఎలా తెలుస్తోందని ప్రశ్నించారు. తాను ఏ ఒక్క ఛానెల్‌నో అనడం లేదని అన్ని ఛానెళ్లని అంటున్నానని అన్నారు. ఒక్క వ్యక్తిని విచారణ కోసం పిలిచినప్పుడు అతడు తప్పు చేశాడా? లేదా? వంటి ఎన్నో విషయాలపై ఆరా తీస్తారని, మొత్తం అయిపోయాక మంచివాడో కాదో చెబుతారని వర్మ అన్నారు. విచారణలోనే డ్రగ్స్ కేసులో ఇంత హైప్ వచ్చేసిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.