: చంద్రుని మీదకి రోవర్ పంపనున్న భారత ప్రైవేట్ కంపెనీ.. ప్రపంచంలో తొలిసారి
అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా చంద్రుని మీద అధ్యయనం కోసం మొదటిసారి ఒక ప్రైవేట్ కంపెనీ తమ రోవర్‌ను పంపించనుంది. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం చేస్తున్న మొదటి ప్రైవేట్ కంపెనీ ఇది. ఇందుకోసం బెంగళూరుకు చెందిన టీమ్ ఇండస్ కంపెనీ అంతరిక్ష నౌకను సిద్ధం చేసుకుంది. ఆగస్టు రెండో వారం నుంచి ఇస్రోలో దీని క్వాలిటీ టెస్టింగ్ ప్రారంభమవుతుందని కంపెనీ మార్కెటింగ్ ఇంఛార్జీ శీలికా రవిశంకర్ తెలిపారు. 24 మంది రిటైర్డ్ ఇస్రో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో 100 మంది యువశాస్త్రవేత్తల బృందం కలిసి 600 కేజీల బరువుండే అంతరిక్ష నౌకతో పాటు 6 కేజీల బరువున్న రోవర్‌ను కూడా తయారుచేశారు. ఈ రోవర్ `ఏక్ ఛోటీసీ ఆశ` అని పేరు పెట్టారు. దీన్ని శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ నౌక ద్వారా పంపించనున్నారు. పీఎస్ఎల్వీ నుంచి వేరయ్యాక 5 రోజుల పాటు ప్రయాణించి ఈ రోవర్ చంద్రుని మీద ఉన్న మారే ఇబ్రియం అనే క్రేటర్ వద్ద దిగుతుందని టీమ్ ఇండస్ సీఈఓ రాహుల్ నారాయణ్ వివరించారు.