: సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు: టాలీవుడ్ లో డ్రగ్స్ కేసుపై అకున్ సబర్వాల్
హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారని, తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మరోసారి స్పష్టం చేశారు. ఈ రోజు టాలీవుడ్ నటుడు సుబ్బరాజుని డ్రగ్స్ కేసులో విచారిస్తోన్న నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం కొనసాగుతున్న విచారణ గురించి ఇప్పుడే పూర్తిగా చెప్పేయడం మంచిది కాదని అన్నారు.
ప్రస్తుతం తాము డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులని ఏయే ప్రశ్నలు అడగాలో దానిమీదే దృష్టి పెట్టామని, విచారణకు హాజరై సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు చేసుకుంటున్న ప్రకటనలపై తాము ఏమీ మాట్లాడలేమని అన్నారు. తాము తెలుగు సినీ పరిశ్రమని టార్గెట్ చేయలేదని, డ్రగ్స్ వ్యవహారం హైదరాబాద్‌లోనే కాకుండా పలు సిటీల్లో కూడా ఉందని, మన నగరంలో డ్రగ్స్‌ను లేకుండా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. నగరాన్ని డ్రగ్స్ విషయంలో క్లీన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న డ్రగ్స్ సమస్యను తాము నిరోధిస్తున్నామని అన్నారు.