: ఏటీఎం ద్వారా పర్సనల్ లోన్... ఐసీఐసీఐ సరికొత్త ఆఫర్!
ఇక లోన్ల కోసం బ్యాంకు చుట్టూ తిరగనక్కరలేదు! మీ దగ్గరిలోని ఏటీఎంకు వెళ్తే సరిపోతుంది. భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ వారు ప్రవేశ పెట్టిన కొత్త ఆఫర్ వల్ల వ్యక్తిగత లోన్లు తీసుకోవడం మరింత సులువుగా మారనుంది. రూ. 15 లక్షల వరకు లోన్లను ఏటీఎం ద్వారా అందజేసేందుకు ఐసీఐసీఐ ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కాకపోతే ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఈ ఇన్స్టంట్ ఏటీఎం లోన్ సేవను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ లోన్ కోసం ఉద్యోగులు బ్యాంకుకు వెళ్లక్కరలేదు. వారి వివరాలను బ్యాంకే కంపెనీ నుంచి తీసుకుని, వ్యక్తిగతలోన్కి యోగ్యులా? కాదా? అనేది నిర్ణయిస్తుంది. ఒకవేళ యోగ్యులే అని తేలితే ఏటీఎం ద్వారా నగదు డ్రా చేసుకునేటపుడు లోన్‌కు సంబంధించిన మెసేజ్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని సంబంధిత సూచనలు పాటిస్తే చాలు... కోరుకున్న లోన్ మొత్తం అకౌంట్లో జమ అవుతుంది. అందుబాటులో ఉన్న లోన్ మొత్తాలు, వాటిపై వడ్డీరేటు, ప్రాసెసింగ్ ఫీజు, నెలవారీ వాయిదాలు వంటి వివరాలన్నీ ఏటీఎం స్క్రీన్ మీదే కనిపిస్తాయి. వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం చేయడానికే ఆఫర్ ప్రవేశ పెట్టినట్లు ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చీ తెలిపారు.