: కన్నడ నటుడు అంబరీష్ కు అస్వస్థత!
కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తడంతో ఆయన్ని బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా అంబరీష్ కుటుంబసభ్యులు మాట్లాడుతూ, నిన్న ఉదయం అంబరీష్ శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడటంతో ఆసుపత్రికి తరలించామని చెప్పారు. డాక్టర్ సతీశ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. అవసరమైన వైద్య పరీక్షలు చేశామని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా, ఈ వార్త తెలియగానే అంబరీష్ అభిమానులు, స్నేహితులు, ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.