: చైనా సహకారం ఏమీ అవసరం లేదు: రాహుల్ గాంధీ
భారత్-పాకిస్థాన్ మధ్య ఎంతో కాలంగా వివాదాస్పదంగా మారిన కశ్మీర్ అంశాన్ని పరిష్కరించడంలో తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామంటూ గతంలో చైనా విదేశీమంత్రిత్వ శాఖ ప్రతినిధి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చైనా వ్యాఖ్యలను భారత్ అప్పట్లోనే తిప్పికొట్టింది. ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చైనా తీరుపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఆ దేశ సహకారం ఏమీ అవసరం లేదని పేర్కొన్నారు. కశ్మీర్ అంటే భారత్ అని, అలాగే భారత్ అంటే కశ్మీర్ అని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్డీయే సర్కారు తీరు వల్ల జమ్ముకశ్మీర్ లో మరిన్ని ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయని ఆయన ఆరోపించారు.