: వ్య‌క్తిపై నిషేధం విధించే అధికారం ఎయిర్‌లైన్స్‌కి లేదు: రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్‌ పీజే కురియ‌న్‌

పార్ల‌మెంట్ స‌భ్యుల‌పైనే కాదు, ఏ వ్య‌క్తి పైనా విమానం ఎక్క‌కుండా నిషేధం విధించే అధికారం ఎయిర్‌లైన్స్ కంపెనీల‌కు లేద‌ని రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ పీజే కురియ‌న్ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల భార‌త విమాన సంస్థ ఎయిరిండియాతో పాటు ఇత‌ర ప్ర‌ధాన ఎయిర్‌లైన్స్ సంస్థ‌లు కొందరు పార్ల‌మెంట్ స‌భ్యుల‌పై నిషేధం విధించిన అంశాన్ని ఎస్‌పీ స‌భ్యుడు న‌రేశ్ అగ‌ర్వాల్ స‌భ‌లో లేవ‌నెత్తారు. ఎయిర్‌లైన్స్ వారికి ఆ అధికారం ఉందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అలా చేయ‌డం పార్ల‌మెంట్ స‌భ్యుల గౌర‌వానికి మ‌చ్చ అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

 దీనికి కురియ‌న్ సమాధానం చెబుతూ, అలాంటి అధికారం లేద‌ని, ప్ర‌భుత్వం ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటుంద‌ని తెలిపారు. `ఒక‌వేళ నిజంగా ఎంపీలు త‌ప్పు చేసుంటే.. శిక్షించ‌డానికి న్యాయ శాఖ ఉంది. ఎయిర్‌లైన్స్ వారు ఎంపీపై నిషేధం విధించి శిక్షించ‌డం త‌ప్పు!` అని కురియ‌న్ అన్నారు. ఇదిలా ఉండ‌గా టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డిపై విధించిన నిషేధాన్ని తొల‌గిస్తున్న‌ట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కోర్టు నుంచి ఇండిగోకు నోటీసులు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. గ‌తంలో కూడా శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్‌పై ఎయిరిండియా సంస్థ నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే!

More Telugu News