: కొత్త ఆవిష్కరణలతోనే దేశాభివృద్ధి సాధ్యం!: ప్రధాని మోదీ
భారతదేశ శ్రేయస్సుకు, అభివృద్ధికి విజ్ఞానం, సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు కీలకమైనవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత శాస్త్ర సాంకేతిక అధికారులతో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ శాస్త్రసాంకేతిక విభాగ కార్యవర్గ సభ్యులందరూ హాజరయ్యారు. సాంకేతిక పరిశోధనల్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి గురించి వారంతా ప్రధానికి వివరించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ - `దేశ సమస్యలకు పరిష్కారం కనిపెట్టడమే శాస్త్రసాంకేతిక రంగ పరమావధి. క్రీడారంగంలో లాగ ఇక్కడ కూడా యువ శాస్త్రవేత్తలను గుర్తించే ప్రయత్నం జరగాలి. దేశ మారుమూల ప్రాంతాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగున పడి వున్న టాలెంట్‌ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి` అన్నారు. భారత శాస్త్రవేత్తల మీద నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ, సాధారణ భారతీయుడు ఎదుర్కుంటున్న సమస్యలను టార్గెట్‌గా చేసుకుని 2022లోగా వాటిని సాధించేందుకు కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.