: తమ్ముడు సాయిరాం, కొడుకు ఆకాశ్ లతో కలసి సిట్ ఆఫీసు లోపలికి వెళ్లిన పూరీ... గేట్లు క్లోజ్!
తన భార్య వీడ్కోలు పలుకగా, తమ్ముడు సాయిరాం, కొడుకు ఆకాశ్ లతో కలసి దర్శకుడు పూరీ జగన్నాథ్ సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు. ఆయనతో పాటు మరో ఆరుగురు రెండు వాహనాల్లో సిట్ కార్యాలయానికి వచ్చారు. నిర్ణీత 10.30 గంటల సమయానికే పూరీ జగన్నాథ్ సిట్ ఆఫీసులోకి వెళ్లాడు. పూరీతో పాటు సాయిరాం, ఆకాశ్ లను లోనికి అనుమతించిన అధికారులు, మిగతావారిని బయటే నిలిపివేసి, గేట్లు మూసేశారు.
అబ్కారీ శాఖ భవంతిలోని ఐదో అంతస్తులో మరికాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. కాగా, పూరీ జగన్నాథ్ సిట్ ఆఫీసుకు వెళుతున్న దృశ్యాలను చిత్రీకరించేందుకు మీడియా చానల్స్ పోటీ పడ్డాయి. బంజారాహిల్స్ వీధుల్లో రేస్ ను తలపించేలా పూరీ కారును మీడియా వెంబడించింది. ఎక్సైజ్ కార్యాలయం వద్దకు సినీ అభిమానులు వస్తుండటంతో బందోబస్తును పెంచాలని ఆ శాఖ అధికారులు పోలీసులను కోరారు. కాగా, వచ్చే నెల 2వ తేదీ వరకూ మొత్తం 12 మంది సినీ ప్రముఖులను సిట్ విచారించనున్న సంగతి తెలిసిందే.