: `మైనే ప్యార్ కియా` షూటింగ్‌లో నిజంగానే ప్రేమ సందేశం పంపించాను: నటి భాగ్యశ్రీ
`మైనే ప్యార్ కియా (తెలుగులో ప్రేమ పావురాలు)` సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ `ఓ..పావురమా..` అంటూ హీరో సల్మాన్‌ఖాన్‌కు ప్రేమసందేశాన్ని పంపుతుంది. అలాగే తాను నిజజీవితంలో కూడా ప్రేమసందేశం పంపినట్లు భాగ్యశ్రీ చెప్పారు. అది కూడా `మైనే ప్యార్ కియా` సినిమా షూటింగ్ జరుగుతున్నపుడే అని స్పష్టం చేశారు. తన జీవిత భాగస్వామి హిమాలయ్ దసానీతో చిన్నప్పుడే మొదలైన ప్రేమ, పెళ్లి వరకు ఎలా వచ్చిందనే సంగతులను తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
`దసానీ అమ్మానాన్నలకు మా పెళ్లి జరగడం ఇష్టమే. కానీ మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. తర్వాత ఆయన అమెరికా వెళ్లిపోయారు. నేను `మైనే ప్యార్ కియా` షూటింగ్‌లో బిజీ అయ్యా. సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఓరోజు దసానీకి - పెళ్లి చేసుకుందాం వచ్చి తీసుకెళ్లు - అని ఫోన్ ద్వారా సందేశం పంపించా` అంటూ భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు. తర్వాత దసానీ నిజంగానే రావడంతో సల్మాన్ ఖాన్, దర్శకుడు సూరజ్ భర్జాతియా సమక్షంలో తమ పెళ్లి జరిగినట్లు భాగ్యశ్రీ వివరించారు. తర్వాత ఏడాదికి కుమారుడు అభిమన్యు పుట్టడంతో సినిమాలకు దూరమైన భాగ్యశ్రీ ఇప్పుడు అవకాశం వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.