: అమ్మ ఎలా ఉంటుందో తెలియదు... అన్నం పెట్టిన అమ్మను వదిలేశాను: వెంకయ్యనాయుడు భావోద్వేగం
బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సమర్పించి, ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేసిన వెంకయ్యనాయుడు, మీడియాతో మాట్లాడుతున్న వేళ భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఏడాదిన్నర వయసులోనే తల్లి చనిపోయిందన్న విషయాన్ని గుర్తు చేసుకున్న సమయంలో ఆయన కళ్లు చమర్చాయి. "అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకు ఏడాదిన్నర వయసులోనే తల్లిని కోల్పోయాను. పార్టీనే అమ్మగా భావిస్తూ జీవితాన్ని గడిపాను. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగాను. నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను. అన్నం పెట్టిన అమ్మవంటి పార్టీని వీడేటప్పుడు మనసంతా బాధతో నిండిపోయింది" అని వెంకయ్య వ్యాఖ్యానించారు. తనకు మద్దతు పలికిన పార్టీలకు వెంకయ్యనాయుడు కృతజ్ఞతలు తెలిపారు.