: జమ్మూ కాశ్మీర్ లో కాలుమోపిన ఐఎస్ఐఎస్... టెలిగ్రాం యాప్ ద్వారా ఉగ్రదాడులపై క్లాసులు!
సిరియా, ఇరాక్ దేశాలను గడగడలాడించి, ఇప్పుడు నెమ్మదిగా నాశనమవుతున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తన ఉనికిని కాపాడుకునేందుకు జమ్మూ కాశ్మీర్ ను వాడుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే కాశ్మీర్ లోయలో కాలుమోపిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, 'అన్సరుల్ ఖలీఫా జమ్మూ కాశ్మీర్' పేరిట ఓ టెలిగ్రాం యాప్ ను నడుపుతూ, భారీ ట్రక్కులను వాడుతూ ఉగ్రదాడులను ఎలా చేయవచ్చన్న విషయమై గ్రూప్ సభ్యులకు తరగతులను నిర్వహిస్తోంది. ఈ యాప్ ద్వారా ఉగ్రవాద సానుభూతిపరులను ఆకర్షిస్తున్న ఐఎస్ నేతలు, వారికి సులువుగా అర్థమయ్యేలా హిందీలో సలహాలు, సూచనలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాశ్మీర్ పోలీసులకు ఫోన్ చేసిన ఉగ్రవాదులు, ముస్లిం వ్యతిరేకులను, ఇస్లాం చట్టాలకు తూట్లు పొడుస్తున్న వారికి తుపాకులతో సమాధానం ఇస్తామని హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది.
అగ్రరాజ్యాల సైనిక దాడులతో భీతిల్లి ఇరాక్ లోని మోసుల్ నగరాన్ని ఖాళీ చేసిన ఉగ్రవాదులు, పాకిస్థాన్ ద్వారా తొలుత పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు, ఆపై జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడుతున్నారని, తిరిగి పూర్వపు స్థితికి చేరేందుకు ఇండియానే తమకు అనువైన ప్రదేశమని భావిస్తున్నారని తెలుస్తోంది. కాగా, టెలిగ్రాం యాప్ నిర్వహణపై ఎన్ఐఏకు చాలా కాలం నుంచి అనుమానాలు ఉన్నప్పటికీ, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కాశ్మీర్ లో ఉన్నారనడానికి ఆధారాలు లేవని రక్షణ శాఖ అధికారులు అంటున్నారు. ఇండియాపై జరిగిన ఉగ్రదాడుల్లో ఒక్కదాన్ని కూడా తమ పనేనని ఐఎస్ఐఎస్ ప్రకటించుకోలేదని గుర్తు చేస్తున్నారు. ఇక ఈ గ్రూప్ ను ప్రారంభించిన అడ్మిన్ లను కేరళలోని కన్నూరు సమీపంలో అధికారులు అరెస్ట్ చేసినప్పటికీ, గ్రూప్ మాత్రం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఆదివారం నాడు కూడా ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాది సజద్ గిల్కర్ ను ప్రశంసిస్తూ ఈ గ్రూప్ లో మెసేజ్ లు చక్కర్లు కొట్టడం గమనార్హం.