: భారత క్రికెటర్ మహమ్మద్ షమీ ఇంటిపై దాడి!
భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఇంటిపై దాడి జరిగింది. షమీని బెదిరించి, ఆయన ఇంట్లో చొరబాటుకు యత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై మరిన్ని వివరాల్లోకి వెళితే, వెస్ట్ కోల్ కతాలోని కట్జునగర్ లోని తన ఇంటికి శనివారం రాత్రి షాపింగ్ ముగించుకుని షమీ, ఆయన భార్యా బయలుదేరారు. ఇంటికి సమీపంలో ప్రమాదవశాత్తూ షమీ కారు ఓ బైకును ఢీకొంది.
ఆపై షమీ డ్రైవర్ కు, బైక్ ను నడుపుతున్న స్థానిక యువకుడికి మధ్య వాగ్వాదం జరుగుతుండగా, షమీ కారు దిగి వచ్చి శాంతింపజేశాడు. ఆపై వారు ఇంట్లోకి వెళ్లిపోగా, కొందరు స్నేహితులను వెంటబెట్టుకు వచ్చిన సదరు యువకుడు, షమీ ఇంటివద్ద హంగామా సృష్టించారు. అడ్డుకున్న కాపలా వ్యక్తిని కొట్టారు. ఇంట్లోకి చొరబడేందుకు ట్రై చేశారు. ఈ వివాదంపై షమీ భార్య పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి యువకులను అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు.