: ప్రతిదీ మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ డి.రూప బదిలీ వ్యవహారంపై ప్రశ్నించిన మీడియాతో, ‘ప్రతిదీ మీడియాతో చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు. ఇదే అంశంపై పదే పదే ప్రశ్నించిన మీడియాకు ఆయన సమాధానమిస్తూ, ‘ఇది అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ.. మీకు ఎందుకు చెప్పాలి?’ అని ప్రశ్నించారు. కాగా, కర్ణాటక న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్రను ఈ విషయమై ప్రశ్నించగా.. జైళ్ల శాఖ డీఐజీ బదిలీ విషయమే తనకు తెలియదని, అధికారులపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు. కాగా, బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే చీఫ్ శశికళ నుంచి లంచాలు తీసుకుని, ఆమెకు వీఐపీ ట్రీట్ మెంట్ అందిస్తున్న విషయాన్ని కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ డి.రూప బయటపెట్టిన విషయం తెలిసిందే.