: రవితేజపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు: సన్నిహితుడు, కుటుంబ వైద్యుడు డా. రాజేంద్ర
డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ హీరో రవితేజ పేరు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ సన్నిహితుడు, కుటుంబ వైద్యుడు కడియాల రాజేంద్ర స్పందించారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, రవితేజపై జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. అవుట్ డోర్ షూటింగ్ లో ఉండటం వల్లే మీడియా ముందుకు రవితేజ రాలేకపోయారని అన్నారు.
రవితేజపై వస్తున్న వదంతుల కారణంగా ఆయన కుటుంబసభ్యులు ఎంతో ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా రవితేజ తమ్ముడు భరత్ మృతి గురించి ఆయన ప్రస్తావించారు. ప్రమాదానికి గురైన రోజున భరత్ మద్యం సేవించి లేడని, గతంలో డ్రగ్స్ కేసులో దొరికిన తర్వాత భరత్ మారిపోయాడని చెప్పారు. భరత్ అంత్యక్రియల విషయంలోనూ రవితేజ కుటుంబాన్ని మీడియా తప్పుగా చిత్రీకరించిందని, అసత్య ప్రచారం చేయొద్దని ఈ సందర్భంగా మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు.