: నా ఆటోగ్రాఫ్ ను అమ్ముకుంటారా! ఇకపై ఇవ్వను: హాలీవుడ్ దర్శకుడి మండిపాటు
‘స్టార్ వార్స్’ సిరీస్ తో హాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జార్జ్ ల్యూకాస్ తన అభిమానులపై మండిపడ్డారు. ఇందుకు కారణం లేకపోలేదు. ల్యూకాస్ ఆటోగ్రాఫ్ ను కొందరు 200 డాలర్లకు అమ్మి సొమ్ముచేసుకుంటున్న విషయం ఆయనకు తెలిసింది. ఈ నేపథ్యంలో లాస్ ఏంజెల్స్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, ‘నేను మీలాగా ఆటోగ్రాఫ్ లు తీసుకుని వాటిని అమ్ముకుంటూ సమయం వృథా చేయలేదు. నా సమయాన్ని సినిమాలు తీస్తూ గడిపాను. అందుకే, ఈ రోజు నా వద్ద ఇంత ఆస్తి ఉంది. సినిమా రంగంలోకి రాకముందు నా చేతిలో నయాపైసా లేదు. ఇలా, నా ఆటోగ్రాఫ్ లు అమ్ముకుని సొమ్ము చేసుకునే బదులు కష్టపడి సంపాదించుకోండి. ఈసారి ఎవ్వరికీ ఆటోగ్రాఫ్ ఇవ్వను’ అని ఆయన అన్నారు.