: కేటీఆర్‌! నువ్వో బచ్చా.. నోరు అదుపులో పెట్టుకో!: ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌ ఓ బచ్చా అని, కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి అతనికి లేదని ఉత్తమ్ అన్నారు. కేటీఆర్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. వరంగల్  లో కార్పొరేటర్ హత్య నేపథ్యంలో, పాత కక్షలే కారణమంటూ నిందితులు పోలీసుల ముందు లొంగిపోయినా... కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిపై తప్పుడు కేసు బనాయించడం దారుణమని అన్నారు. కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఉత్తమ్ చెప్పారు. రైతులకు మేలు చేస్తున్నామని చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం... వారికి నకిలీ విత్తనాలను అంటగడుతోందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ హయాంలో పోలీసులు కూడా గులాబీ చొక్కాలే వేసుకుని పని చేస్తున్నట్టు ఉందని విమర్శించారు. మూడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. 

More Telugu News