: 'బిగ్‌బాస్ షో'పై మరింత ఆసక్తిని రేకెత్తించిన జూనియర్ ఎన్‌టీఆర్ .. షో కొత్తగా ఉండడంతో టీవీలకు అతుక్కుపోయిన తెలుగు ప్రేక్షకులు!
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ షో 'స్టార్ మా' చానల్‌లో ఆదివారం బ్రహ్మాండంగా ప్రారంభమైంది. తన అద్భుతమైన వ్యాఖ్యానంతో ఎన్టీఆర్ ఈ షోపై ప్రేక్షకులకు మరింత ఆసక్తిని కలిగించారు. ఇంతవరకూ పెద్ద తెరమీద తమ అభిమాన హీరో జూనియర్ ఎన్‌టీఆర్‌ను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు బుల్లి తెరమీద తనివితీరా చూసుకుని మురిసిపోయారు.
ఈ షో కోసం పూణెలో ఏర్పాటుచేసిన సెట్‌ను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ షోలో మొత్తం 14 మంది భాగస్వామ్యం వహించనున్నారు. వీరిలో మొదటి కాంటెస్టెంట్ గా అర్చన (నువ్వొస్తావని ఫేం) బిగ్ బాస్ సెట్‌లోకి అడుగుపెట్టారు. తరువాత సమీర్ (మగధీర ఫేం), ముమైత్‌ఖాన్, వర్థమాన హీరో ప్రిన్స్, సింగర్ మధుప్రియ, నరసింహాచారి ఉరఫ్ సంపూర్ణేష్ బాబు, నటి జ్యోతి, సింగర్ కల్పన, సినీ విమర్శకుడు రమేష్ కత్తి, యాంకర్ కత్తి కార్తీక, నటుడు శివబాలాజీ, టీవీనటి హరితేజ, సినీ నటుడు ఆదర్శ్, హాస్య నటుడు ధన్‌రాజ్ తమదైన స్టయిల్‌ను ప్రదర్శిస్తూ సెట్‌లోకి అడుగుపెట్టారు.
వీరంతా ఈ బిగ్‌బాస్ సెట్‌లో 70 రోజులు గడపనున్నారు. ఈ సెట్‌లో మొత్తం 60 కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే సెట్‌లో అద్బుతమైన స్విమ్మింగ్‌ఫూల్, విశాలమైన హాలు ఏర్పాటు చేశారు. ఈ 70 రోజులు వీరు ఏమేమి చేస్తారన్నది కెమెరాలో రికార్డవుతుంటుంది. పార్టిసిపెంట్స్ కు ఈ 70 రోజులు బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. షో నిబంధనల ప్రకారం ఇంట్లోని వారితో ఫోన్‌లో సంభాషించేందుకు అవకాశం ఉండదు. షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్‌టీఆర్ ఉల్లాసంగా, ఉత్సాహంగా కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్నారు.