: యూపీ అసెంబ్లీలో బాంబు వెనుక దావూద్ ఇబ్రహీం: అమర్ సింగ్


ఈ నెల 12 యూపీ అసెంబ్లీ భవనంలో లభ్యమైన పేలుడు పదార్థాల వెనుక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయని సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ ఆరోపించారు. దావూద్ గ్యాంగ్ తో ఎస్పీ నేత అబూ అజ్మీకి సంబంధాలు ఉన్నాయని, ఘటనపై విచారిస్తున్న పోలీసులు అజ్మీని ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు. అజ్మీ ఇటీవలి కాలంలో విదేశీ పర్యటనలు అధికంగా చేశాడని, సెక్యూరిటీ ఏజన్సీలు వాటిని నిశితంగా గమనిస్తే, మరిన్ని వివరాలు తెలియవచ్చని అమర్ సింగ్ అన్నారు.

కాగా, అసెంబ్లీలో అనుమానాస్పద పొడి లభించడం, దీన్ని పేలుడు పదార్థాల తయారీలో వాడతారన్న విషయం బయటకు రావడంతో, ఎన్ఐఏ దర్యాఫ్తునకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులపై కేసును నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం విచారణ ప్రారంభించారు. విపక్ష నేత రామ్ గోవింద్ చౌధరి సీటుకు దగ్గర్లో 60 గ్రాముల పీఈటీఎన్ లభ్యమైన సంగతి తెలిసిందే. యూపీ అసెంబ్లీ భవనం మొత్తాన్నీ ధ్వంసం చేసేందుకు అర కిలో పీఈటీఎన్ సరిపోతుందని, దాన్ని వాడి పేలుడుకు పాల్పడితే, భవనంలోని ప్రతి ఒక్కరూ మరణించి వుండేవారని దర్యాఫ్తు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News