: టీఆర్ఎస్ నేత మురళి హత్య కేసులో కీలక మలుపు... నిందితుల్లో నాయిని రాజేందర్ రెడ్డి!
వరంగల్ టీఆర్ఎస్ నేత, కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసులో ఏ-4గా జిల్లా కాంగ్రెస్ చీఫ్ నాయిని రాజేందర్ రెడ్డి పేరును పోలీసులు రిమాండ్ రిపోర్టులో చేర్చారు. ఆయనతో పాటు పోతుల శ్రీమాన్, కానుగంటి శేఖర్ పేర్లను కూడా చేర్చారు. వీరంతా కాంగ్రెస్ నాయకులే కావడం గమనార్హం. గత వారంలో పట్టపగలే మురళి ఇంట్లోకి జొరబడి, ఆయన్ను హత్య చేసిన నిందితులు, ఆపై తాపీగా పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. వారిని ఏ-1, ఏ-2, ఏ-3లుగా చేర్చిన పోలీసులు, విచారించిన అనంతరం కాంగ్రెస్ నేతల పేర్లు చేర్చారు. తన తండ్రిని హత్య చేసిన కేసులో మురళి నిందితుడని, తనను చంపేందుకు ఆయన కుట్ర చేస్తున్నారన్న సమాచారం అందడంతోనే తాను మురళిని అంతమొందించాలని నిర్ణయించుకున్నానని ప్రధాన నిందితుడు విక్రమ్ విచారణలో తెలిపినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, నాయిని రాజేందర్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలను జిల్లా కాంగ్రెస్ నేతలు ఖండించారు.