: భారత్‌తో బలపడనున్న అమెరికా రక్షణ సంబంధాలు
భారత్‌తో రక్షణ సంబంధాల విషయంలో అమెరికా మరో ముందడుగు వేసింది. భారత్‌తో రక్షణ సంబంధాలు కొనసాగించడానికి సరికొత్త విధానాన్ని అమెరికా ప్రవేశపెట్టనుంది. ఈ విషయానికి సంబంధించిన బిల్లును ఇప్పటికే అమెరికా ప్రజాప్రతినిధుల సభ ఆమోదించింది. 621 బిలియన్ డాలర్లు విలువ చేసే రక్షణ ఒప్పందాలు గల ఈ బిల్లును భారత సంతతికి చెందిన సభ్యురాలు అమీ బెరా ప్రతిపాదించారు. మూజువాణి ఓటుతో దీన్ని ఆమోదించడంతో పాటు అక్టోబర్ నుంచి నిధులను సమకూర్చాలని నిర్ణయించారు.
కాకపోతే ఈ రక్షణ ఒప్పందాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే కొంత కసరత్తు అవసరమని అమీబెరా అన్నారు. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు బాగా చర్చించుకొని నిధులు ఎలా వెచ్చించాలనే విషయంపై స్పష్టతకు రావాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఇందుకు 180 రోజుల సమయం ఉందని ఆమె చెప్పారు. ఈ రక్షణ బిల్లు వల్ల భారత-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌తో రక్షణ సహకార ఒప్పందాల వైపు అమెరికా పెద్దగా మొగ్గు చూపలేదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకుండా దాన్ని అణచివేయడానికి చర్యలు తీసుకుంటేనే రక్షణపరమైన సహాయం చేస్తామని అమెరికా తేల్చిచెప్పింది. వాటికి సంబంధించిన మెరుగుదల గురించి అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ అధికారికంగా ధ్రువీకరించిన తర్వాతనే నిధులు మంజూరు చేస్తామని ప్రకటించింది.