: జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్ కాదు... వెనక్కు తగ్గిన బీసీసీఐ!

టీమిండియా నూతన కోచ్ రవిశాస్త్రి వచ్చీ రాగానే బోర్డులో తన పట్టును నిరూపించుకున్నాడు. కోచ్ గా రవిని, బ్యాటింగ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ను, బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ను నియమించినట్టు మొన్న ప్రకటించిన బీసీసీఐ, తాజాగా జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్ కాదని సంచలన ప్రకటన వెలువరించింది. ఆయన కేవలం సలహాదారు మాత్రమేనని స్పష్టం చేసింది. తనకు అనుకూలమైన వారిని సహాయకులుగా తీసుకోవాలని భావించిన రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ ను తీసుకోవాలని నిర్ణయించుకుని, ఆ విషయాన్ని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడంతోనే వివాదం మొదలైంది.  

సచిన్‌ టెండూల్కర్‌, సౌరభ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ లతో కూడిన సలహా కమిటీ రవిశాస్త్రిని సంప్రదించిన తరువాత మాత్రమే ద్రావిడ్, జహీర్ ల పేర్లను బయటపెట్టింది. అయితే, సహాయ బృందంగా ఎవరుండాలన్న విషయంలో తుది నిర్ణయం తనదేనని, రెండేళ్లు కలసి పనిచేయాలంటే తనకిష్టమైన వారే ఉండాలని రవిశాస్త్రి పట్టుబట్టాడు. దీంతో వెనుకంజ వేసిన బీసీసీఐ తాజా ప్రకటన వెలువరిస్తూ, జహీర్ విదేశీ పర్యటనలకు మాత్రమే అందుబాటులో ఉంటాడని వివరణ ఇచ్చింది. ఇక 24 గంటల వ్యవధిలోనే తన ప్రకటనను మార్చుకున్న బీసీసీఐ వైఖరిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News