: కేమెరూన్-నైజీరియా సరిహద్దులో ఉగ్రదాడి.. తమను తాము పేల్చేసుకున్న మహిళలు.. 12 మంది దుర్మరణం!
కేమెరూన్-నైజీరియా సరిహద్దులో బుధవారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మరో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వాజా అనే చిన్న పట్టణంలోని రద్దీ ప్రదేశంలో ఇద్దరు మహిళలు తమను తాము పేల్చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే దాడిలో ఒక సూసైడ్ బాంబర్ పాల్గొనగా మరో మహిళను కాల్చి చంపినట్టు ఆర్మీ కల్నల్ వివరించారు. ఈ ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. అయితే ఇది బొకొహరామ్ పనేనని అనుమానిస్తున్నారు. పట్టణాన్ని పూర్తిగా దిగ్బంధించామని, సిటీ నుంచి ఎవరినీ బయటకు పంపడం కానీ, బయట వ్యక్తులను లోపలికి అనుమతించడం కానీ చేయడం లేదని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు.