: చైనాలో ఎక్కడికైనా చేరేలా భారత మిసైల్స్ రెడీ!: అమెరికా రీసెర్చ్ రిపోర్టు


చైనాలోని అన్ని ప్రాంతాలనూ చేరగలిగేలా భారత్ సరికొత్త అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటోందని అమెరికా కీలక నివేదికలో తెలిపింది. ఇండియాలో ప్రస్తుతం 7 న్యూక్లియర్ సామర్థ్యమున్న వ్యవస్థలు ఉన్నాయని, వాటిల్లో రెండు విమానాల్లో ఉండగా, నాలుగు భూభాగంగా ఖండాంతర క్షిపణులను ప్రయోగించేలా, మరొకటి సముద్రంలో విహరిస్తూ, విరుచుకుపడేలా భారత్ తయారు చేసుకుందని పేర్కొంది.

ఇప్పటివరకూ పాకిస్థాన్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన భారత్, ఇప్పుడు చైనా మొత్తాన్నీ టార్గెట్ చేసిందని ఇద్దరు టాప్ అమెరికన్ న్యూక్లియర్ నిపుణులు తయారు చేసిన నివేదిక తెలిపింది. ఈ నివేదిక డిజిటల్ జర్నల్ 'ఆఫ్టర్ మిడ్ నైట్' జూలై - ఆగస్టు సంచికలో ప్రచురితమైంది. దక్షిణాదిలోని బేస్ లను, ముఖ్యంగా ఒడిశా, ఏపీ, తమిళనాడులోని తీరప్రాంత ఆర్మీ బేస్ లను వాడుకుని చైనాలోని అన్ని ప్రాంతాలనూ టార్గెట్ చేసేలా ఇండియా సిద్ధంగా ఉందని 'ఇండియన్ న్యూక్లియర్ ఫోర్సెస్ 2017' పేరిట ఈ వ్యాసం ప్రచురితమైంది.

ఇండియా వద్ద కనీసం 150 నుంచి 200 న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారీకి అవసరమైన ప్లూటోనియం నిల్వలను భారత్ ఉత్పత్తి చేసిందని ఈ రిపోర్టులో అంచనా వేసిన అణు శాస్త్రవేత్తలు హాన్స్ ఎం కిర్ స్టెన్సన్, రాబర్ట్ ఎస్ నోరిస్ లు వీటితో 120 నుంచి 130 వార్ హెడ్స్ ను సులువుగా తయారు చేయవచ్చని తెలిపారు. పాకిస్థాన్ తో పాటు చైనాను కూడా విరోధిగా భావిస్తున్న ఇండియా, మరింత దూరం వెళ్లగలిగే క్షిపణులను సిద్ధం చేసుకుంటోందని, వచ్చే దశాబ్ద కాలంలో భారత అణుపాటవం ఎన్నో రెట్లు పెరగనుందని వారు తెలిపారు. కనీసం నాలుగు ప్రాంతాల్లో కొత్త అణు వ్యవస్థలను భారత్ సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు. 150కి పైగా వార్ హెడ్లలో నింపేందుకు 600 కిలోగ్రాముల వెపన్ గ్రేడ్ ప్లూటోనియం అవసరం కాగా, ఆ నిల్వలు ఇప్పటికే భారత్ వద్ద చేరిపోయాయని, ఈ ప్లూటోనియాన్ని న్యూక్లియర్ వార్ హెడ్లలో నింపే పనిలో భారత్ ఉందని తమకు సమాచారం అందినట్టు వారు తెలిపారు.

ఇక అణు వార్ హెడ్లను మోసుకు వెళ్లేందుకు మరింతగా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న అగ్ని-2 సిద్ధంగా ఉందని, ఈ క్షిపణి 2 వేల కిలోమీటర్ల దూరం మేరకు వెళుతుందని కిర్ స్టెన్సన్, నోరిస్ లు వెల్లడించారు. దీని పరిధిలోనే పశ్చిమ, కేంద్ర, దక్షిణ చైనాలు ఉన్నాయని తెలిపారు. ఇక మరింత ఆధునికీకరణ దిశగా తయారవుతున్న అగ్ని-4 సిద్ధమై, దాన్ని ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రయోగిస్తే, బీజింగ్, షాంగై సహా చైనా మొత్తం దాని పరిధిలోనే ఉంటుందని, ఇక అగ్ని-5 అందుబాటులోకి వస్తే, 5 వేల కిలోమీటర్లలోని లక్ష్యాలను అది ఛేదిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాలతో పాటు చైనాకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో క్షిపణి బేస్ లను నిర్మిస్తోందని ఈ రీసెర్చ్ ఆర్టికల్ లో వ్యాసకర్తలు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News