: రజనీకి మినహాయింపు లేదు... న్యాయంగా లేకపోతే ఎవరైనా నాకు ఒకటే!: కమలహాసన్


నిర్మొహమాటంగా తన అభిప్రాయం వెల్లడించడంలో కమలహాసన్ ముందుంటారు. తాజాగా తమిళంలో బిగ్ బాస్ షోపై చెలరేగిన వివాదంపై కమల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ఆయన పలు విషయాలపై మాట్లాడారు. "37 ఏళ్లుగా నాకంటూ ఓ పాప్యులారిటీ ఉంది. ఇప్పుడు ‘బిగ్‌ బాస్‌’ కోసం నేను తప్పు చేస్తానా? ఈ షో వల్ల సంప్రదాయాలు చెడిపోతాయనుకుంటే... గత 11 ఏళ్లుగా ఏం చేస్తున్నారు? హిందీలో వస్తే సంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదా?... మరి సినిమాల్లో వచ్చే ముద్దుల సీన్ల వల్ల జరిగేది ఏమిటి?... ఆ సీన్లలో నటించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? నేను ముద్దు సీన్లలో నటించినప్పుడు వాళ్లు ఎందుకు అడగలేదు? ’’ అని ఆయన నిలదీశారు. కొందరికి ఏదో ఒక రాద్ధాంతం చేయడం అలవాటని ఆయన అభిప్రాయపడ్డారు. తానేం చేసినా కొంత మందికి నచ్చదని ఆయన తెలిపారు.

ఇక బిగ్ బాస్ లాంటి షో కంటే ఆమీర్‌ ఖాన్‌ లా ‘సత్యమేవ జయతే’ వంటి కార్యక్రమం చేయవచ్చు కదా? అని కొంత మంది తనను అడుగుతుంటారని.... వారందరికీ తాను చెప్పేది ఒకటేనని, వాళ్లు తెర మీద చేస్తున్నది తాను 37 ఏళ్లుగా నిజజీవితంలో చేస్తున్నానని, తన వల్ల ఎంత వీలయితే అంత చేస్తూనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

ఇక రజనీ రాజకీయ ప్రవేశంపై తన అభిప్రాయం వెల్లడిస్తూ...‘‘సిస్టమ్‌ బాగాలేదని నేను రెండేళ్ల క్రితమే చెప్పాను. రజనీ ఈ మధ్య కొత్తగా చెప్పారు, అంతే. ఒకవేళ ఆయన పార్టీ పెడితే... న్యాయంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది. ఒకవేళ న్యాయంగా లేకపోతే ఈ రోజు నేను ఏ విధంగా పార్టీలను విమర్శిస్తున్నానో అలాగే రజనీని కూడా విమర్శిస్తాను. అందులో రజనీకి ఎలాంటి మినహాయింపు ఉండదు’’ అని ఆయన స్పష్టం చేశారు. తాను జీఎస్టీని వ్యతిరేకించలేదని, అదే సమయంలో జీఎస్టీ సినిమాను నష్టపరిచేలా ఉండకూడదని మాత్రం చెబుతానని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News