: వెండితెర మాంత్రికుడు స్పీల్‌బర్గ్ జీవితంపై డాక్యుమెంటరీ!
తెర మీద అద్భుతాలు సృష్టించే హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ జీవితంపై తీసిన డాక్యుమెంటరీ త్వరలో ప్రసారం కానుంది. దీనికి సూసెన్ లేసీ దర్శకత్వం వహించారు. చిన్న వయసులో స్పీల్‌బర్గ్ ఎదుర్కున్న సమస్యలతో పాటు దర్శకునిగా మారాక తన అనుభవాలను క్రోడీకరిస్తూ లేసీ ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. ఇందులో స్టీవెన్ తన వ్యక్తిగత విషయాలను తానే స్వయంగా వివరించారు. అలాగే స్టీవెన్‌తో సన్నిహిత సంబంధమున్న దర్శకులు జేజే అబ్రామ్స్, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, జార్జ్ లూకస్, నటులు టామ్ హ్యాంక్స్, హారిసన్ ఫోర్డ్, లియోనార్డో డికాప్రియోలు చెప్పిన విషయాలు కూడా ఈ డాక్యుమెంటరీలో చూడొచ్చు.
స్టీవెన్ కథను తెలుసుకోవడానికి 80 మందికి పైగా ప్రముఖులను దర్శకురాలు సూసెన్ ఇంటర్వ్యూ చేసినట్లు సమాచారం. స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించిన `జాస్`, `ఈటీ`, `జురాసిక్ పార్క్`, `షిండ్లర్స్ లిస్ట్`, `సేవింగ్ ప్రైవేట్ రాయన్` సినిమాల నిర్మాణ వీడియోలను కూడా డాక్యుమెంటరీలో పొందుపరిచారు. అక్టోబర్ 7న హెచ్‌బీఓ ఛానల్‌లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది.