: కొత్త నిబంధనతో ఉస్మానియా యూనివర్సిటీలో పెనుకలకలం.. నాన్ బోర్డర్స్ ను ఖాళీ చేయిస్తున్న అధికారులు!


హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్లో పెను కలకలం రేగుతోంది. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే యూనివర్శిటీ హాస్టళ్లలో ఉండాలన్న నిబంధన యూనివర్సిటీ ఆరంభం నుంచి ఉంది. అయితే అది అమలులో లేదని సిబ్బంది పలు సందర్భాల్లో పేర్కొంటారు. తెలంగాణ ఉద్యమం సమయంలో భారీ ఎత్తున నాన్ బోర్డర్స్ ఉస్మానియాలో తిష్టవేశారని పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలో జరిగే ఆందోళనల్లో సింహభాగం వారే ఆక్రమిస్తుంటారని పలువురు పేర్కొంటుంటారు. అయితే తాజాగా, ఉస్మానియాలో నాన్ బోర్డర్స్ విషయంలో ఉదాసీనత పనికిరాదనే నిర్ణయానికి పాలక కమిటీ వచ్చింది.

దీంతో తక్షణం నాన్ బోర్డర్స్ ని ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం నాలుగంటే నాలుగే రోజుల్లో యూనివర్సిటీలోని అన్ని హాస్టళ్ల నుంచి నాన్‌ బోర్డర్స్ ను ఖాళీ చేయించాలని, వార్డెన్లు తనిఖీలు నిర్వహించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మొండికేసిన వారిని ఖాళీ చేయించేందుకు అవసరమైతే యూనివర్సిటీ హాస్టళ్లకు విద్యుత్‌, నీటి సరఫరా నిలిపేయాలని సూచించింది. అప్పటికీ నాన్ బోర్డర్లు ఖాళీ చేయకుంటే పోలీసుల సహకారం తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, పలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువకులు స్నేహితుల సహకారంతో యూనివర్సిటీల్లో ఉంటారు. లైబ్రరీ సౌకర్యం అందుబాటులో ఉండడంతో ఉద్యోగార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ కల్పతరువులా కనిపిస్తుంది. అందువల్ల విద్యార్థులు ఉస్మానియాలో ఉండేందుకు మొగ్గు చూపుతారు.

  • Loading...

More Telugu News