: ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం మంచిది కాదు: వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
'అన్న వస్తున్నాడు' అనే ఒకే ఒక మాటకు టీడీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్లీనరీ విజయవంతం అయిందని చెప్పారు. రాష్ట్ర మంత్రులంతా ప్రజా సంక్షేమాన్ని మరిచిపోయారని... జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యల పట్ల జగన్ మాత్రమే స్పందిస్తున్నారని చెప్పారు. వివిధ వ్యవస్థలను మేనేజ్ చేయడం, డబ్బు రాజకీయాలను నడపడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో విశ్వాసం ఉందని చంద్రబాబు భావిస్తుంటే, పార్టీ ఫిరాయించిన వారితో వెంటనే రాజీనామా చేయించి, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో గెలుపుకోసం విచ్చలవిడిగా తాయిలాలను ఇస్తున్నారని విమర్శించారు. నంద్యాలలో జరుగుతున్న అన్యాయాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు.