: అందంగా తయారవ్వాలని 30 లక్షలు ఖర్చుపెడితే అంతా చడామడా తిడుతున్నారు!
బయటకు చెప్పలేకపోయినా... అందంగా కనిపించాలని వయసుకు వచ్చిన ప్రతిఒక్కరూ ఆశిస్తారు. అందరిలాగే మలేసియాలోని కెలంటన్ నగరానికి చెందిన అమిరుల్ రిజ్వానా ముసా కూడా ఆశించి, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని అందంగా మారాడు. దీంతో అతనిని అభిమానించిన వారంతా శత్రువుల్లా మారిపోయారు. చీదరించుకుంటున్నారని వాపోతున్నాడు. వివరాల్లోకి వెళ్తే... అమిరుల్ రిజ్వానా ముసా సౌందర్య ఉత్పత్తుల సంస్థను నిర్వహిస్తున్నాడు. అతని బ్రాండ్ కు అక్కడ మంచి పేరుంది.
దీంతో 2012లో ఉల్ ఝంగ్ ఆసియా ఆన్ లైన్ కాంపిటీషన్ లో కూడా విజయం సాధించాడు. తర్వాత అతనికి మోడలింగ్ అవకాశాలు రావడం ఆరంభించాయి. ఒక వైపు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ, మరోవైపు మోడలింగ్ చేస్తూ మంచి పేరుతెచ్చుకున్నాడు. మరింత అందంగా కనిపించాలన్న తాపత్రయంతో 2014లో కాస్మోటిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుని వివిధ దశల్లో సర్జరీలు చేయించుకుని అందుకు సమారు 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి కోరుకున్నట్టు మారాడు.
ప్లాస్టిక్ సర్జరీలతో పూర్తిగా రూపం మార్చుకున్న తరువాత మియ్యో రిజోన్ అనే పేరుతో ఫేస్ బుక్ ఖాతా ఓపెన్ చేసి, తన ఫోటోలు పెట్టడం ప్రారంభించాడు. దీంతో అతను కార్టూన్ పాత్ర కెన్ డాల్ లా మారాలని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడని సోషల్ మీడియాలో కథనాలు ప్రచారమయ్యాయి. దీంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏంటని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నేరుగా అతని వద్దకు వెళ్లి చడామడా తిడుతున్నారట. ఇంకొందరు అతను ఎదురైతే చాలు అసహ్యించుకుంటున్నారట.
దీనిపై అతను వివరణ ఇస్తూ...పదహారేళ్ల వయసు ఉన్నపుడు చికెన్ పాక్స్ వచ్చి తన మొహంపై మచ్చలు ఏర్పడి చర్మం పూర్తిగా పాడైందని అన్నాడు. దీంతో తనలో ఆత్మన్యూనత పెరిగిపోయిందని, గతంలో కంటే అందంగా కనిపించి ఆత్మస్థైర్యం పెంచుకోవాలని భావించి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని...తనను అర్థం చేసుకోవాలని కోరుతూ వివరణ ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని అతను వాపోతున్నాడు.