: మంచి రోజులు ముందున్నాయ్: వైసీపీ నేత పార్థసారధి
తాము నిర్వహించిన ప్లీనరీ విజయవంతం కావడంతో టీడీపీ నేతలకు చమటలు పడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి అన్నారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్లీనరీతో తాము ఏపీ ప్రజలకు ఓ భరోసా ఇచ్చామని వ్యాఖ్యానించారు. తమ ప్లీనరీకి వచ్చిన స్పందన చూసి టీడీపీ నేతలు ఎందుకు కలవరపడుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే మంచి రోజులు వస్తాయని చెప్పారు. 'ముందున్నాయ్ మంచి రోజులు' కార్యక్రమాన్ని తమ పార్టీ నేతలు ఇంటింటికీ తీసుకెళ్తారని అన్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడిందని పార్థసారధి ఆరోపణలు చేశారు. సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణలను సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు. తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను నియమించుకోవడాన్ని టీడీపీ నాయకులు తప్పుబట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు.