: ఏపీలో జగన్ తో జతకట్టిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు తమిళనాడులో డీఎంకేతో చర్చలు జరుపుతున్నారు!
ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్-సమాజ్ వాదీ పార్టీల కూటమి, ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి... ఘోర వైఫల్యం చెందిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రతిభను చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఆయన ఏపీలో వైసీపీతో జతకట్టారు. రానున్న ఎన్నికల్లో జగన్ ను మఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) ఇప్పుడు తమిళనాడులోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోంది. డీఎంకేకు వ్యూహరచన చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ప్రాథమిక స్థాయి చర్చలు జరిగాయి. అయితే ఇంతవరకు ఇరు పక్షాల మధ్య పక్కాగా చర్చలు జరగలేదని కొందరు డీఎంకే నేతలు చెబుతున్నారు. ఇప్పటికే తమిళనాడు యువత నుంచి నియోజకవర్గ మేనేజర్ల ఉద్యోగాలకు గాను ఐప్యాక్ దరఖాస్తులను ఆహ్వానించింది. తమిళనాడులోని రాజకీయ స్థితిగతులను పరిశీలించడానికే నియోజకవర్గ మేనేజర్లను ఐప్యాక్ నియమించుకుంటున్నట్టు కొందరు చెబుతున్నారు. 2021లో జరగనున్న తమిళనాడు ఎన్నికలకు డీఎంకే, ఐప్యాక్ లు కలసి పని చేసే అవకాశాలు ఉన్నాయి.