: ఎస్‌బీఐ వినియోగదారులపై జీఎస్టీ దెబ్బ!
ఇటీవల అమల్లోకి వచ్చిన `ఒక దేశం- ఒక పన్ను` విధానంలో భాగంగా బ్యాంకింగ్ సేవలపై ఇంతకు ముందు ఉన్న 15 శాతం పన్ను 18 శాతానికి పెరిగింది. దీంతో భారతీయ స్టేట్ బ్యాంక్ తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్, బడ్డీ యాప్, చెక్‌బుక్ సేవలపై కొత్త రేట్లను ప్రకటించింది. ఎస్‌బీఐ బడ్డీ యాప్ ద్వారా డబ్బు డ్రా చేస్తే రూ. 25తో పాటు జీఎస్టీ చెల్లించాలి. అలాగే నగదు బదిలీ చేస్తే 3 శాతం ప్రాసెసింగ్ ఫీజుతో పాటు జీఎస్టీ చెల్లించాలి.
ఐఎంపీఎస్ ద్వారా లక్ష కంటే తక్కువ బదిలీ చేస్తే రూ. 5తో పాటు జీఎస్టీ, లక్ష నుంచి 2 లక్షల మధ్య అయితే రూ. 15తో పాటు జీఎస్టీ, 2 నుంచి 5 లక్షల మధ్య బదిలీ చేస్తే రూ. 25తో పాటు జీఎస్టీ పన్ను చెల్లించాలి. అలాగే 10 పేజీల చెక్‌బుక్ కోసం రూ. 30తో పాటు 18 శాతం జీఎస్టీ, 25, 50 పేజీల చెక్‌బుక్ కోసం వరుసగా రూ. 75, రూ. 150లతో పాటు జీఎస్టీ చెల్లించాలి. అలాగే పాతనోట్లు మార్చుకునే సేవలో కూడా ఎస్‌బీఐ కొత్త రేట్లు ప్రకటించింది.
20 నోట్లు లేదా రూ. 5000 విలువ గల నోట్లను మార్చుకోవడానికి ప్రతి నోటుకి రూ. 2 చొప్పున సర్వీస్ ఫీజుతో పాటు జీఎస్టీ కూడా చెల్లించాలని తెలిపింది. జీఎస్టీ ధాటిని తట్టుకునే శక్తి ప్రస్తుతం బ్యాంకులకు లేదని, అందుకే కొద్ది మొత్తంలో వినియోగదారుల మీద భారం వేయక తప్పడం లేదని ఎస్‌బీఐ ప్రతినిధి వివరించారు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే, ఏటీఎం ద్వారా డబ్బు డ్రా చేసుకునే సేవలపై ఎలాంటి మార్పులు చేయలేదని, పాత ఛార్జీలే యథావిధిగా అమలవుతాయని ఆయన చెప్పారు.