: బంతి తగిలి విలవిల్లాడుతూ, మైదానంలో కూలబడిన క్రికెటర్... బెంబేలెత్తిపోయిన ఆటగాళ్లు!

క్రికెట్ లో ఈ మధ్య కాలంలో చోటుచేసుకుంటున్న మార్పుల్లో వేగంతో పాటు పవర్ గేమ్ కీలకమైనది. తొలుత టెస్టు మ్యాచ్ లకు ఆదరణ ఉండేది. తరువాత వన్డేలు టెస్టుల్లో వేగాన్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు టీ20లు ఆట స్వరూపాన్నే మార్చేశాయి. ఇప్పుడు టెక్నిక్ కంటే పవర్ కే అధిక ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ వర్థమాన క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణానికి కారణం కూడా పవర్ గేమే... తాజాగా, ఎడ్జ్‌ బాస్టన్‌ లో నాటింగమ్‌ షైర్‌, బర్మింగ్‌ హామ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ లో క్రికెటర్లను బెంబేలెత్తించిన ఘటన చోటుచేసుకుంది.

నాటింగమ్‌ షైర్‌ బౌలర్‌ ల్యూక్‌ ఫ్లెచర్‌ (28) వేసిన బంతిని బర్మింగ్‌ హామ్‌ బ్యాట్స్‌ మన్‌ సామ్‌ హెయిన్స్‌ బలంగా స్ట్రయిట్‌ డ్రైవ్‌ ఆడాడు. అది నేరుగా ఫ్లెచర్‌ తలకు బలంగా తగిలింది. దీంతో ఫ్లెచర్ విలవిల్లాడుతూ, మైదానంలో కుప్పకూలిపోయాడు. దాంతో ఆటగాళ్లంతా షాక్ తిన్నారు. సిబ్బంది హుటాహుటీన స్పందించి, అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనతో సుమారు 30 నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. ఈ మ్యాచ్ లో బర్మింగ్ హామ్ జట్టు విజయం సాధించింది.

More Telugu News