: ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రాథమిక విధేమీ కాదు.. దానిని తప్పనిసరి చేయొద్దు!: సుప్రీంకి విన్నవించిన కేంద్రం
దేశంలోని పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని తప్పనిసరి చేయాలని అత్యున్నత న్యాయస్థానం భావిస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఓటు హక్కు వినియోగం పౌరుల ప్రాథమిక విధి కిందకు రాదని, కాబట్టి దానిని తప్పనిసరి చేయవద్దని సుప్రీంకోర్టును కోరింది. 2015లో సత్యప్రకాశ్ అనే వ్యక్తి దేశంలో ఓటింగ్‌ను తప్పనిసరి చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అర్జెంటీనా, బెల్జియం, బ్రెజిల్‌లో ఓటు హక్కు వినియోగం తప్పనిసరి అని, దేశంలో గుజరాత్ కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తోందంటూ ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
దీనికి ప్రతిగా కేంద్ర న్యాయశాఖ కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఓటింగ్ తప్పనిసరి చేయడం అప్రజాస్వామికమని అందులో పేర్కొంది. పౌరులకు ఓటు హక్కు కల్పిస్తున్న ఎన్నికల చట్టం దానిని వినియోగించడాన్ని మాత్రం తప్పనిసరి చేయలేదని తెలిపింది. అయినా ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటు ఇస్తుందని వివరించింది. ఓటు వినియోగం పౌరుల విధి అయినా తప్పనిసరి మాత్రం కాదని తేల్చి చెప్పింది. ఇటువంటి పిటిషన్లను అనుమతిస్తూ పోతే ఇటువంటివే మరికొన్ని వచ్చి పడతాయని, ఫలితంగా విధానాలు, చట్టాల రూపకల్పనకు ఇబ్బందిగా మారుతుందని కేంద్రం పేర్కొంది.