: లెవిస్ దెబ్బకు భారత్ కకావికలు.. ఏకైక టీ20లో విండీస్ ఘన విజయం!
భారత్‌తో కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో జరిగిన ఏకైక టీ20లో విండీస్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 191 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. మెరుపులు మెరిపిస్తాడనుకున్న ఓపెనర్ క్రిస్‌గేల్ 18 పరుగులకే అవుటైనా, మరో ఓపెనర్ ఎవిన్ లెవిస్ భారత్ బౌలర్లను ఆటాడుకున్నాడు. సునామీ వచ్చినట్టు ఊగిపోయాడు. బంతి కనిపిస్తే చాలు శివాలెత్తిపోయాడు. అతడి దెబ్బకు భారత బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. లెవిస్‌కు బంతి వేయాలంటేనా భయపడిపోయేలా చేశాడు. 62 బంతులు మాత్రమే ఎదుర్కొన్న లెవిస్ 12 సిక్స్‌లు, 6 ఫోర్లతో అజేయంగా 125 పరుగులు చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. మరో ఎండ్‌లో ఉన్న శామ్యూల్స్ 29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 36 పరుగులు చేశాడు. లెవిస్ బాదుడుతో మరో 9 బంతులు ఉండగానే విండీస్ విజయం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు ఒక్క వికెట్ దక్కింది.
అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ 39, శిఖర్ ధావన్ 23, రిషబ్ పంత్ 38, దినేశ్ కార్తీక్ 48, ధోనీ 2, కేదార్ జాదవ్ 4, రవీంద్ర జడేజా 13, రవిచంద్రన్ అశ్విన్ 11 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో జెరోమ్ టేలర్, విలియమ్స్ చెరో రెండు వికెట్లు తీయగా, శామ్యూల్స్ ఒక వికెట్ పడగొట్టాడు.