: చంద్రబాబు అడిగిన ప్రశ్నతో ఇరుకునపడి బిత్తరపోయిన రావెల కిశోర్ బాబు!
మంద కృష్ణ మాదిగ పిలుపు ఇచ్చిన 'కురుక్షేత్ర' సభపై సీఎం చంద్రబాబు మంత్రులు కేఎస్ జవహర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, ఎమ్మెల్యేలు అనిత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితర మాదిగ వర్గం నేతలతో సమావేశమైన వేళ, బాబు అడిగిన ప్రశ్నతో రావెల కిశోర్ బాబు ఇరుకునపడ్డారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక బిత్తరపోయారు. రాష్ట్రాన్ని విభజిస్తున్న వేళ, తనకు తెలంగాణే ముఖ్యమన్న మంద కృష్ణ, ఇప్పుడు ఏపీకి వచ్చి పోరాటాలు చేయడం ఏంటని అనిత నిలదీసిన సమయంలో, రావెల కల్పించుకుని, "నేను మంత్రిగా ఉన్నప్పుడు మంద కృష్ణను రాష్ట్రంలోకి రానివ్వకుండా చేశాను. మాదిగల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో చేస్తున్నా ఆయన అర్థరహిత విమర్శలు చేస్తున్నారు" అన్నారు.
ఆ వెంటనే చంద్రబాబు కల్పించుకుని, ఇప్పుడేమో ఆయన్ను ఇంట్లోనే పెట్టుకున్నారుగా, గుంటూరులో మీ ఇంట్లోనే కదా ఆయన బస? అని సూటిగా అడిగేసరికి రావెల ఇరుక్కుపోయారు. తేరుకునేందుకు కొంత సమయం తీసుకున్న ఆయన, మంద కృష్ణ డొనేషన్స్ కోసం తన ఇంటికి ఎప్పుడైనా వచ్చి పోతారని చెప్పి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక మంద కృష్ణ వచ్చి రావెల ఇంట్లో బస చేసిన విషయం చంద్రబాబుకు ఎలా తెలిసిందా? అని మిగతా నేతల్లో చర్చ కూడా జరిగినట్టు సమాచారం.