: ‘మలబార్ ఎక్సర్‌సైజ్‌’తో మాకొచ్చిన ముప్పేమీ లేదు.. చేసుకోండి!: భారత్, యూఎస్, జపాన్ విన్యాసాలపై చైనా


మలబార్ తీరంలో ఇండియా, అమెరికా, జపాన్ నేవీలు కలిసి సైనిక విన్యాసాలు చేస్తుండడంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చైనా తేల్చి చెప్పింది. అది సాధారణంగా జరిగే ప్రక్రియేనని, మూడో దేశాన్ని ఉద్దేశించి చేసినది కాదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తాము గతంలోనూ చెప్పామని పేర్కొన్న చైనా.. ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం కోసం దేశాల మధ్య ఇటువంటి విన్యాసాలు మామూలేనని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షంగ్ తెలిపారు.

మలబార్ తీరంలో భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అమెరికా విమాన వాహక నౌక నిమితిజ్, జపాన్ హెలికాప్టర్ కేరియర్ ఇజుమోలు ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. మూడు దేశాలు కలిసి ఇంత పెద్ద ఎత్తున నౌకా విన్యాసాలు నిర్వహించడం ఇదే తొలిసారి. దేశాల మధ్య ఇటువంటి సంబంధాలు, సహకారం మూడో దేశాన్ని లక్ష్యం చేసుకుని నిర్వహిస్తున్నవి కావని తాము అభిప్రాయపడుతున్నట్టు గెంగ్ పేర్కొన్నారు. అంతేకాదు, అది ప్రాంతీయ శాంతికి, భద్రతకు కూడా ఎంతగానో అవసరమన్నారు. కాగా, మూడు దేశాలు కలిసి నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు చైనాను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్నవేనని చైనా అధికారిక పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో గెంగ్ షంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News