: ఆన్ లైన్ పరీక్ష ద్వారా 319 కోట్ల పేపర్ ఆదా చేసిన రైల్వే శాఖ!
కేవలం ఒక పరీక్ష ద్వారా ఇండియన్ రైల్వేస్ ఏకంగా 4 లక్షల చెట్లు, 319 కోట్ల ఏ4 సైజు పేపర్లను ఆదా చేసింది. తాజాగా రైల్వేల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం గత జనవరిలో మూడుదశల్లో పరీక్ష నిర్వహించింది. 14,000 ఉద్యోగాలకు 351 కేంద్రాల్లో సుమారు 92 లక్షల మంది అభ్యర్థులు పరీక్షను రాశారు. అయితే గతంలోలా కాకుండా ఈ సారి పరీక్షను రికార్డు స్థాయిలో ఆన్ లైన్ లో నిర్వహించారు.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్ లైన్ పరీక్షగా రికార్డులకెక్కింది. మలిదశ పరీక్ష సైకాలజికల్, టైపింగ్ నైపుణ్య పరీక్షను గత నెల 29, 30 తేదీల్లో నిర్వహించారు. వాస్తవానికి మాస్ కాపీయింగ్, పేపరు లీకేజీ సమస్యలను అధిగమించేందుకు ఆన్ లైన్ పరీక్ష విధానాన్ని అనుసరించిన రైల్వే శాఖ... భారీ స్థాయిలో ఆదాయం మిగిలిందని ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నిర్వహించి, ఎంపికైన అభ్యర్థులు దీపావళి నాటికి విధుల్లో చేరేలా ఏర్పాట్లు చేసింది.