: డిమాండ్లను పట్టించుకోని ఖతార్... మండిపడుతున్న అరబ్ దేశాలు!
గడువు ముగిసినా తమ డిమాండ్లపై ఎలాంటి హామీ ఇవ్వని ఖతార్ పై సౌదీ అరేబియా, దాని మిత్ర దేశాలు మండిపడుతున్నాయి. ఖతార్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపిస్తూ, ఆ దేశంతో సౌదీ అరేబియా, దాని మిత్రదేశాలు దౌత్య, ఆర్థిక, భౌగోళిక సంబంధాలు తెంచుకున్నాయి. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే అల్ జజీరా చానల్ మూసివేత, టర్కీ సాయుధ దళాల తొలగింపు, ఇరాన్ తోను, ఐసిస్, అల్ ఖైదా వంటి పలు ఉగ్రవాద సంస్థలతోను సంబంధాలను తెంచుకోవడం వంటి 13 డిమాండ్లను ఖతార్ ముందుంచి తొలుత 40 రోజుల గడువు విధించాయి.
అయితే ఖతార్ స్పందించకపోవడంతో మరో 14 రోజుల గడువును ఇచ్చాయి. దీనిపై కూడా ఖతార్ ఏమాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాతో పాటు దాని మిత్ర దేశాలు ఖతార్ మొండి వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. అరబ్ దేశాల్లో శాంతిభద్రతలను దెబ్బతీయడమే ఖతార్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించాయి. ఇప్పటికైనా ఖతార్ తమ డిమాండ్లకు అంగీకరించాలని సూచించాయి. కాగా, ఖతార్ మాత్రం సౌదీ అరేబియా, దాని మిత్ర దేశాల డిమాండ్లకు అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది.