: వీరిని బామ్మలనాలంటే ఒకసారి ఆలోచించాల్సిందే!... కావాలంటే వీడియో చూడండి!
ఆ మహిళలను చూస్తే ఎవరూ వృద్ధులని అనుకోరు. ఎందుకంటే, 80 ఏళ్ల వయసున్న ఆ మహిళా జట్టు సభ్యులు బాస్కెట్ బాల్ ను ఆశ్చర్యపోయేలా ఆడుతూ ఆకట్టుకుంటున్నారు. అమెరికా, కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో సీనియర్ ఉమెన్స్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఉంది. 1920-30 మధ్య పుట్టిన వారంతా కలిసి కాలక్షేపం చేస్తున్న వేళ... తమ జీవితకాలంలో ఎన్నో అవకాశాలను కోల్పోయామని ఓసారి బాధ పడ్డారట. దీంతో అవకాశాలు అందుకోవడానికి అప్పట్లో మిగిలిపోయిన సరదాలు తీర్చుకునేందుకు వయసుతో సంబంధం ఏంటని భావించారు.
దాంతో ఉత్సాహంగా ఉన్నవారంతా కలసి ఓ బృందంగా చేరి బాస్కెట్ బాల్ ముచ్చట తీర్చుకుంటున్నారు. ఈ అసోసియేషన్ లో 80 ఏళ్లు పైబడిన మహిళలు మాత్రమే సభ్యులుగా చేరే అవకాశముంది. ఇటీవల అక్కడ నిర్వహించిన నేషనల్ సీనియర్ గేమ్స్ పోటీల్లో ఈ 80 ఏళ్లు పైబడిన మహిళల బృందం బాస్కెట్ బాల్ లో రెండు టైటిళ్లు సొంతం చేసుకుని అందర్నీ అవాక్కయ్యేలా చేసింది.
ఇంకా విశేషం ఏమిటంటే, ఈ బృందంలో 90 ఏళ్లు పైబడినవారు ఇద్దరున్నారు. వీరి బృందం ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ... 20 ఏళ్లు వచ్చేసరికే వయసుమళ్లిన వారిలా వ్యాయామం జోలికి వెళ్లకుండా మంచానికి పరిమితమయ్యే సోమరులను వెక్కిరిస్తోంది. వీడియో మీరు కూడా చూడండి.