: తల్లకిందులుగా ఆగిపోయిన రోలర్ కోస్టర్... థ్రిల్ అనుకుంటే ప్రాణాలు పోయినంత పనైంది...వీడియో చూడండి
అమ్యూజ్ మెంట్ పార్క్ లలో రోలర్ కోస్టర్ పై ప్రయాణం ఒక థ్రిల్... రోలర్ కోస్టర్ అంటే భయమున్నప్పటికీ అది తల్లకిందులైనప్పుడు భయంతో కేకలు వేస్తూ ఆ అనుభవాన్ని కూడా ఆస్వాదించడం ఒకరమైన క్రేజ్. అయితే అలాంటి క్రేజ్ ఉన్న కొంతమందికి రోలర్ కోస్టర్ భయంకరమైన అనుభవాన్ని మిగిల్చిన ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఇంగ్లాండ్‌లోని మైల్ ఓక్ ప్రాంతంలో డ్రేటాన్ మానర్ థీమ్ పార్క్ ఉంది. అందులోని జీ- ఫోర్స్ రోలర్ కోస్టర్ సందర్శకులను ఎక్కించుకుని పరుగులు తీస్తుంది. ఈ క్రమంలో మొన్నామధ్య ఈ పార్క్ లో సందర్శకులను ఎక్కించుకుని ఈ రోలర్ కోస్టర్ బయల్దేరింది.
అయితే, మార్గమధ్యంలో ఏ అవాంతరం వచ్చిందో ఏమో కానీ అందులోని వారంతా తల్లకిందులుగా ఉన్న సమయంలో ఆగిపోయింది. సాధారణంగా అది వేగంగా ప్రయాణిస్తూ క్షణకాలం పాటు తల్లకిందులైతేనే అందులోని వారి నుంచి భయంతో కూడిన అరుపులు వినిపిస్తాయి. అలాంటిది తల్లకిందులుగా ఆగిపోతే అక్కడి వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక్కసారిగా అందులోని వారంతా భయంతో కేకలు వేయడం ప్రారంభించారు. చేతులూపుతూ తమను రక్షించాలని కిందనున్నవారిని కోరారు. దీంతో పార్క్ సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని జాగ్రత్తగా కిందికి దించారు. దీనిని ఒక వ్యక్తి దూరం నుంచి వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టగా ఇది వైరల్ అవుతోంది. ఆ క్షణాలలో తమ ప్రాణాలు పోయినంతపనైందని కిందకి దిగిన తరువాత వారంతా నిట్టూర్చారట. ఆ వీడియోను మీరు కూడా చూడండి.