: ఎన్టీఆర్ ను అవమానపరిచేలా బయోపిక్ తీస్తే వెంటపడికొడతారు!: పోసాని కృష్ణమురళి
సీనియర్ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా రూపొందించే చిత్రాన్ని ఆయన్ని అవమానపరుస్తూ తీస్తే కనుక, థియేటర్ లో ప్రేక్షకులు రాళ్లు వేస్తారని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి హెచ్చరించారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘రామారావుగారిని అవమానపరుస్తూ బయోపిక్ తీస్తే, స్క్రీన్ ని చింపేస్తారు.. వెంటపడికొడతారు. ఆయనకు అవమానం జరిగినా, తక్కువ చేసి మాట్లాడినా చాలా డిస్టర్ బెన్స్ అవుతుంది.
రామారావుగారి గురించి నేను తప్పుగా మాట్లాడాననుకోండి, నన్ను చెప్పుతో కొడతారు. అసలు రామారావుగారి గురించి తప్పుగా మాట్లాడే అంశాలు ఆయన జీవితంలో లేవు. ఈ విషయమై నేను ఎవ్వరితోనైనా మాట్లాడగలను. అయితే, ఈ విషయమై దర్శకుడు రాము గారితో మాత్రం నేను చచ్చినా మాట్లాడను. ఆయనంటే నాకు గౌరవం ఉంది. రాముగారిని సినిమా తీయద్దని చెప్పే హక్కు నాకు లేదు. నాకు రామారావు గారు ఎవరెస్ట్ ఇన్ ఇండియా. దట్సాల్. ఆ ఎవరెస్ట్ పై మచ్చపడొద్దు. నా తరపున, మీ ఛానెల్ ద్వారా రామూ కైనా, ఎవరికైనా ఇదే నా రిక్వెస్ట్’ అని పోసాని అన్నారు.