: సరిహద్దులో ఉద్రిక్తతల నడుమ ఎస్‌సీవో సమావేశానికి హాజరైన భారత్
సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సమయంలో చైనాలో నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సమావేశానికి భారత్ హాజరైంది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. చైనా ఆధిపత్యంలోని ఎస్‌సీవోలో భారత్, పాక్‌లు పూర్తిస్థాయి సభ్యత్వం పొందాక సభ్య దేశాల మధ్య జరిగిన తొలి సమావేశం ఇదే. ఈశాన్య చైనా లియోనింగ్ ప్రావిన్స్ లోని దలియన్‌లో గురువారం జరిగిన ఈ సమావేశంలో చైనా, ఇండియా, రష్యాలు కూడా పాల్గొన్నాయి.
ఎస్‌సీవోలో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్ సభ్యదేశాలు కాగా భారత్, పాక్‌లు గత నెలలోనే పూర్తి సభ్యత్వం అందుకున్నాయి. ఈ విషయంలో భారత్‌కు అండగా రష్యా నిలవగా పాక్‌కు చైనా మద్దతుగా నిలిచింది. కాగా, తాజా సమావేశంలో ఉగ్రవాదంపై పోరాటం, వేర్పాటువాదం, తీవ్రవాదం తదితర వాటిపై చర్చించారు. కాగా, ప్రస్తుతం చైనా, భారత్ సరిహద్దులో సిక్కిం సెక్టారులో భారత్, చైనా దళాలు పెద్ద ఎత్తున మోహరించి ఉండడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఎస్‌సీవోలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.