: టీమిండియా బౌలర్ల ధాటికి విండీస్ విలవిల.. చిత్తుగా ఓడిన కరీబియన్లు.. 2-0 ఆధిక్యంలో భారత్!
వన్డే సిరీస్‌లో భాగంగా అంటిగ్వా నార్త్ సౌత్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శుక్రవారం విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 93 పరుగుల తేడాతో కరీబియన్ జట్టును ఓడించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో నిలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం 252 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 38.1 ఓవర్లలో 158 పరుగులకే చాపచుట్టేసింది. భారత్ బౌలర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, హార్ధిక్ పాండ్యాల నిప్పులు చెరిగే బంతులకు విండీస్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. ఎదుర్కోలేక వికెట్లు సమర్పించుకుని వెంటవెంటనే పెవిలియన్ చేరారు.
విండీస్ బ్యాట్స్‌మెన్‌లో జాసన్ మొహమ్మద్ 40, రోవ్‌మన్ పావెల్ 30, షాయ్ హోప్ 24 పరుగులు చేయగా ఆ తర్వాత అత్యధిక పరుగులు వచ్చింది ఎక్‌స్ట్రాల ద్వారానే. భారత బౌలర్లు 23 పరుగులు ఎక్‌స్ట్రాల రూపంలో సమర్పించుకున్నారు. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టే పెవిలియన్‌కు క్యూ కట్టడంతో విండీస్ 38.1 ఓవర్లలోనే 158 పరుగులకు ఆలౌటై 93 పరుగుల భారీ తేడాతో మ్యాచ్‌ను భారత్‌కు సమర్పించుకుంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 11 పరుగులకే శిఖర్ ధవన్ (2) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. మైదానం తడిగా ఉండడంతో పరుగులు రాబట్టడం బ్యాట్స్‌మెన్‌కు కష్టమైంది. దీంతో మ్యాచ్ ఎటువంటి మెరుపులు లేకుండా నిదానంగా సాగింది. ఈ క్రమంలో 34 పరుగుల వద్ద కెప్టెన్ కోహ్లీ (11) రెండో వికెట్ రూపంలో వెనుదిరగ్గా, ఆ తర్వాత వచ్చిన యువరాజ్ సింగ్ 39 పరుగులతో ఫరవాలేదనిపించాడు.
మరోవైపు ఓపెనర్ అజింక్య రహానే విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 112 బంతులు ఎదుర్కొన్న రహానే 4 ఫోర్లు, సిక్స్‌తో 72 పరుగులు చేసిన తర్వాత నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం బరిలోకి దిగిన ధోనీ 79 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 78 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. చివరల్లో కేదార్ జాదవ్ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లోనే 4 ఫోర్లు, సిక్స్‌తో 40 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో విగెల్ కమిన్స్ 2, జాసన్ హోల్డర్, దేవేంద్ర బిషూ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్ ఐదు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధోనీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.